Kingdom Review: మూవీ రివ్యూ: కింగ్డమ్

చిత్రం: కింగ్డమ్
రేటింగ్: 2.5/5
తారాగణం: విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకిటేష్ వి.పి, అయ్యప్ప శర్మ, గోపరాజు రమణ, మహేష్ ఆచంట, మురళిధర్, రోహిణి తదితరులు
కెమెరా: గిరీష్ గంగాధరన్, జోమొన్ టి జాన్
కూర్పు: నవీన్ నూలి
సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్
నిర్మాత: నాగ వంశి, సాయి సౌజన్య
రచన- దర్శకత్వం: గౌతం తిన్ననూరి
విడుదల: 31 జూలై 2025

Garden Image

విజయ్ దేవరకొండ హిట్ ని చవి చూసి చాలా నాళ్లయ్యింది. అలాగే “మిస్టర్ బచ్చన్” తో అరంగేట్రం చేసిన భాగ్యశ్రీకి ఆ చిత్రం కలిసిరాలేదు. ఎప్పుడో “జెర్సీ”తో తన ఉనికిని చాటుకున్న గౌతం తిన్ననూరి ఆ స్థాయి సినిమా చేసింది లేదు. ఈ ముగ్గురి కలయికలో వచ్చిన ‘కింగ్డమ్” టీజర్ తో “కేజీఎఫ్” వైబ్స్ తీసుకొచ్చింది. ట్రైలరుతో అంచనాలు ఏర్పడ్డాయి. ఇంతకీ ఇందులో ఉన్నదేంటో చూద్దాం.

కథ 1920 లొ శ్రీకాకుళం లో మొదలవుతుంది. తెల్లదొరలతో అక్కడొక తెగ పోరాడుతుంది. ఆ తెగ నాయకుడు (విజయ్ దేవరకొండ) ఆ తెగకు చెందిన పిల్లల్ని మాత్రం కాపాడి వీరమరణం చెందుతాడు. ఆ పిల్లలు సముద్రం దాటి శ్రీలంకకు చేరి అక్కడ బతుకుతూ ఉంటారు. తమ నాయకుడు రెండవ రాక కోసం ఎదురుచూస్తూ ఉంటారు.

కట్ చేస్తే, సూరి (విజయ్ దేవరకొండ) హైదరాబాదులో ఒక కానిస్టేబుల్. కాని ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే స్టేబుల్ గా ఉండడు. ఎస్సైని అయినా లాగి లెంపకాయ కొట్టేయగలడు. ఆ తెగువని చూసిన ఒక పెద్ద వ్యక్తి అతనికొక అండర్ కవర్ జాబ్ చూపిస్తాడు. అది శ్రీలంకకి వెళ్లి చేయాల్సిన పని. అక్కడికి వెళ్లడానికి ఒక ఎర కూడా వేస్తాడు. 18 ఏళ్లుగా సూరి తప్పిపోయిన తన అన్నయ్య శివ కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ శివ శ్రీలంకలో ఉన్నాడని ఆ పెద్ద వ్యక్తికి తెలుసు. కనుక శివని కలిసి అతనితో వెనక్కి రావాలంటే తాను చెప్పిన పని చేస్తే సరిపోతుందంటాడు ఆ వ్యక్తి. దాంతో సూరి లంకకి బయలుదేరతాడు. అక్కడ జాఫ్నా జైల్లో ఖైదీగా చేరతాడు. తన అన్న శివ (సత్యదేవ్) ని అక్కడే కలుస్తాడు. తర్వాత ఏమయ్యింది? అసలా పెద్ద వ్యక్తి యొక్క లక్ష్యం ఏంటి? శివ ధ్యేయం ఏమిటి? శ్రీకాకుళం నుంచి లంకకి తరలి వెళ్లిన తెగతో సూరికి లింక్ ఎలా ఏర్పడుతుంది? అవన్నీ తెర మీద చూడాలి.

ఈ కథలో ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. అయితే ఆ లక్ష్యం వెనుక ఉన్న అవసరం, భావోద్వేగం మాత్రం ప్రేక్షకుల మనసుని తాకవు. కేవలం ఎలివేషన్ షాట్లు, ఏదో జరిగిపోతోందన్న ఫీలింగిచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో నడుస్తూ ఉంటుంది.

ప్రధమార్ధం ముగిసే సరికి కథ అర్ధం కాదు. ఏదో జరుగుతున్నట్టు ఉంటుంది తప్ప మైండికి ఎక్కదు, మనసుని తాకదు. దాదాపు 70 ఏళ్ల ముసలతన్ని ఒక ఎస్సై అందరూ చూస్తుండగా చితకబాదడం, దానికి చలించి ఆ ఎస్సైని కొట్టే కనిస్టేబుల్ హీరో…ఇలాంటివి చాలా ఓల్డ్ స్టైల్ టేకింగ్ అనిపిస్తాయి.

అయితే 30 నిమిషాల్లో కాన్-ఫ్లిక్ట్ పాయింట్ వచ్చింది కానీ, అక్కడి నుంచి నడిపే విధానంలో చాలా ఫ్లాస్ కనిపించాయి. జైల్లో సూరి చేసే ఫైట్ ఎవరికోసమో, దేని కోసమో అర్ధం కాదు. అన్నగారిని కలవడానికి పలు మార్గాలుంటాయి. కానీ కేవలం ఫైట్ పెట్టడం కోసం ఆ సీన్ పెట్టినట్టు ఉంది. పైగా కొట్టడానికి గల కారణం కూడా చాలా చిన్నది. తెర మీద సరైన డ్రామా పండించకుండా ఎంత హై వోళ్టేజ్ ఫైట్ పెట్టినా, ఆ ఫైట్ చూస్తూ ఇతర సీన్లో ఖైదీలు ప్లేట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తున్నా హాల్లో ఆడియన్స్ కనెక్ట్ అయిపోరు. ఎందుకు అంతలా కొడుతున్నాడా అంటూ అయోమయంగా చూస్తారు.

ఇలా పాకాన పడని సీన్లు ఎన్నో ఉన్నాయి. అయితే ప్రతి సీన్ అవ్వగానే హీరోని కిందనుంచి పైకి షాట్ వేసి చూపిస్తూ “యమ హేల హేలా హే” అని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేయడం వల్ల దానిని హీరోయిజం అనుకోవాలి. ఈల వేయడం వస్తే వేయాలి.

ఈ సినిమాకి ప్లస్ పాయింట్లేంటే మొత్తం సాంకేతిక విభాగమే. ప్రధమంగా కెమెరావర్క్ ఆ తర్వాత బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఇవి ఇంత బాగున్నప్పుడు కథ, కథనం కూడా మరింత బలంగా ఉంటే మరో స్థాయిలో ఉండేది ఈ చిత్రం.

1920 నాటి శ్రీకాకుళం ట్రైబల్స్ లో ఎవ్వరూ ఆ యాస మాట్లాడరు. ఆ ట్రైబ్ లో ఒక సీనియర్ సిటిజెన్ అయితే కిరీటాన్ని ఒక పిల్లవాడికి ఇస్తూ డైలాగులు చెప్తాడు. ఆ భాష దేవరకొండ బాలగంగాధర్ తిలక్ కవిత్వంలా ఉంది తప్ప నేచరల్ ఆర్గానిక్ ఫ్లోలో లేదు. ఒక కానిస్టేబుల్ శ్రీలంకలో అండర్ కవర్ ఆపరేషన్ కి వెళ్లడం…ఇవన్నీ కన్విన్సింగ్ గా లేవు.

ఎప్పుడో 2005 నాటి ఛత్రపతిని, 2010 నాటి యుగానికి ఒక్కడు ని కలగలపి వండిన తిరగమోత వంటకంలా ఉంది తప్ప రైటింగులో ఎక్కడా మెరుపులు లేవు.

అనిరుధ్ రవిచంద్రన్ ని పెట్టుకుని ఒక్క మాస్ అప్పీలింగ్ పాట కూడా లేకపోవడం పెద్ద మైనస్ ఈ చిత్రానికి. ఉన్న ఒక్క రొమాంటిక్ సాంగ్ కూడా లెంగ్త్ ఎక్కువైందని లేపేసారు.

విజయ్ దేవరకొండని మాత్రం మెచ్చుకుని తీరాలి. తన రొటీన్ స్టైల్లో కాకుండా విభిన్నమైన కేరెక్టర్ పోషించాడు. అయితే దానికి తగ్గట్టుగా కథ, కథనం కలిసొస్తే తన స్థాయి పెరిగేది. ఓపెనింగ్ సీన్స్ లో కానిస్టేబుల్ గా యంగ్ గా కనిపించిన విజయ్, శ్రీలంక ఎపిసోడ్ లో చాలా ఏజ్డ్ గా కనిపించాడు.

భాగ్యశ్రీకి సరైన పాత్రే కాదు. గ్లామర్ పరంగా గానీ, పర్ఫార్మెన్స్ రీత్యా గానీ తన టేలెంట్ చూపించే అవకాశమే లేకపోయింది.

సత్యదేవ్ మాత్రం ఉన్నంతలో బాగా నటించాడు. తన ప్రతిభకి ఇలాంటి పాత్ర వేయడం చాలా తేలిక.

మురుగన్ పాత్రధారి వెంకిటేష్ బాగానే నటించాడు కానీ ఆ పాత్రకి అతని కటౌట్ సరిపోలేదు.

అయ్యప్పశర్మ బైరాగిగా ఓకే. మిగిలిన అందరూ చిన్నాచితకా పాత్రల్లో స్క్రీన్ ప్రెజెన్స్ వరకు ఓకే.

చివరగా చెప్పేదేంటంటే, ఏదో ఒక పెద్ద ఎపిక్ స్థాయి కథ చెప్పాలని ప్రయత్నించి, ఆ స్థాయి కన్విక్షన్ ఉన్న కథనం రాసుకోలేకపోయినట్టుంది. పైన చెప్పినట్టు పాత సినిమాల్ని రంగరించి కేజీఎఫ్ తరహా టెంప్లేట్ లో హై వోల్టేక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెట్టేసి పని కానిచ్చేసినట్టు ఉంది తప్ప కొత్త అనుభూతిని, గూజ్ బంప్స్ మొమెంట్స్ ని మాత్రం ఇవ్వలేకపోయింది ఈ చిత్రం. మొదటి నుంచి చివరి వరకు ఎంగేజ్ చేస్తుంది తప్ప ఎగ్జైట్ చేయదు. రెండో పార్ట్ ఉందని చెప్పినా కూడా దానిపై ఆసక్తికలిగేలా లేదు. ఈ చిత్రంతో తెలిసిన విషయమేంటంటే విజయ్ దేవరకొండ అన్ని రకాల సినిమాలూ చేయడానికి సుముఖంగా ఉన్నాడని, చేయగలడని. కథాకథనాల్లో పెద్ద విషయం లేదన్నది పక్కనపెడితే సాంకేతిక విషయాలు బాగున్నాయని చూడాల్సిన చిత్రమిది. విజయ్ కష్టానికి తగిన చిత్రం మాత్రం కాదిది. మరో కేజీఎఫ్ అవుతుందేమోనన్న అంచనాలని అందుకోలేకపోయింది.



 

Comments

Popular posts from this blog

చిత్రం: హరిహర వీరమల్లు