చిత్రం: హరిహర వీరమల్లు

చిత్రం: హరిహర వీరమల్లు

రేటింగ్: 1.75/5
తారాగణం: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, నాజర్, సునీల్, సుబ్బరాజు, బాబీ డియోల్, అయ్యప్ప శర్మ, సత్యరాజ్, పూజిత పొన్నాడ, అనసూయ, దలిప్ తహిల్, సచిన్ ఖేదేకర్, కోట శ్రీనివాసరావు, రఘుబాబు తదితరులు
కెమెరా: జ్ఞాన శేఖర్, మనోజ్ పరమహంస
ఎడిటింగ్: ప్రవీణ్
సంగీతం: కీరవాణి
కథ: క్రిష్ జాగర్లమూడి
నిర్మాత: ఎ.ఎం రత్నం
దర్శకత్వం: క్రిష్, జ్యోతి కృష్ణ
విడుదల: 24 జూలై 2025


2019 లో శ్రీకారం చుట్టుకున్న ఈ చిత్రం ఆరేళ్లకి తెర మీదకొచ్చింది. పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి అయిన తర్వాత తెర మీదకొచ్చిన ఆయన తొలి చిత్రమిది. ఆయన రాజకీయ ప్రస్థానం వల్ల కొంత, ఇతర కారణాల వల్ల మరికొంత షూటింగులు వాయిదా పడుతూ తెరకెక్కిన ఈ చిత్రం అంచనాలని ఏర్పరచుకోలేకపోయింది. నానా పురిటి నొప్పులు పడ్డాక కూడా విడుదల వాయిదా పడడం వల్ల ఈ చిత్రంపై ఆసక్తి ఇంకాస్త సన్నగిల్లింది. ప్రచార సామగ్రి కూడా అంతగా ఆకట్టుకోకపోవడం వల్ల మరింత డీలా పడింది. అయితే ఎట్టకేలకి పవన్ కళ్యాణ్ స్టార్ వేల్యూ వలన ఆఖరి వారంలో కాస్త వేడి పుంజుకుంది. ఐదేళ్లు జాడీలో ఊరపెట్టి తీసిన ఈ వీరమల్లు ఎలా ఉందో చూద్దాం.

“వీరమల్లు అనే కిరాయిదొంగ ఢిల్లీలో ఔరంగజేబు సింహాసనంపై ఉన్న కోహినూర్ వజ్రాన్ని తీసుకురావడానికి అయ్యే ప్రయాణం” అని ఈ వీరమల్లు పార్ట్-1 కథని సింగిల్ లైన్లో చెప్పేయొచ్చు.

కాస్త విపులంగా చెప్పుకోవాలంటే 16 వ శతాబ్దంలో కర్ణుడు నదిలో కొట్టుకొచ్చినట్టు ఒక పిల్లవాడు నీటిలో తేలుతూ వచ్చి ఒక అగ్రహారం వాసులకి దొరుకుతాడు. వాళ్లు ఆ పిల్లాడికి వీరమల్లు అని పేరు పెడతారు. అతడు పెద్దయ్యి వజ్రాల దొంగలా మారతాడు. మచిలిపట్నంలో తాను చేసిన ఒక దొంగతనం గురించి విని ఒక దొర (శరత్ ఖేదేకర్) ఒక వజ్రాల దొంగతనం కోసం తనని పిలిపిస్తాడు. ఆ దొర దగ్గర పంచమి (నిధి అగర్వాల్) అనే అమ్మాయి ఉంటుంది. ఆమె వీరమల్లు ప్రేమలో పడుతుంది. వీరమల్లు కూడా ఆమెని ఇష్టపడతాడు. దొర చెప్పిన వజ్రాలని దొంగిలించడంతో పాటు, పంచమిని కూడా లేవదీసుకుపోయే క్రమంలో వీరమల్లు గోల్కండ నవాబుకి చిక్కుతాడు. ఆ నవాబు (దలిప్ తాహిల్) వీరమల్లుకి ఒక పని అప్పజెబుతాడు. కొల్లూరులో దొరికి, అలా అలా చేతులు మారి ఔరంగజేబు వద్దకు చేరిన కోహినూర్ వజ్రాన్ని తీసుకురమ్మని ఆ పని సారాంశం. ఆ వజ్రాన్ని తెస్తే దానికి బదులుగా ఒక వజ్రాల గనినే ఇస్తానంటాడు నవాబు. అలా కిరాయిదొంగగా బయలుదేరిన వీరమల్లు ఎక్కడి వరకు చేరతాడు అనేది తక్కిన కథ.

అసలీ కథే ఉడికీఉడకనట్టుగా ఉంది. అయినప్పటికీ ప్రారంభ సన్నివేశాలు గంభీరంగానే ఉన్నాయి. కానీ కాసేపటికే కథనంలో ఎక్కడా బిగువు లేదన్నది తెలుస్తూ ఉంటుంది.

కథకి కావాల్సిన ప్రధానమైన విషయం కాన్-ఫ్లిక్ట్ పాయింట్. అది వెతికినా కనపడదు. ఏ ఎమోషన్ తో కనెక్ట్ అయ్యి చూడాలో అర్థం కాదు. ముస్లిం రాజులు హిందువులపై చేసిన అరాచకాలకి కనెక్ట్ అయ్యి ఆ ఎమోషన్ తో చూడాలన్నట్టుగా తీసారు. కానీ అవి కృతకంగా ఉండడం, దానికి తోడు వీరమల్లు హిస్టారికల్ పాత్ర కాకపోవడంతో విషయం రక్తి కట్టదు. అన్నీ హీరో ఎలివేషన్ కోసం పెట్టుకున్న బలవంతపు సీన్లలాగానే ఉన్నాయి.

మొన్నీమధ్యన వచ్చిన “ఛావా” చిత్రం చారిత్రాత్మకం. కనుక ఆ కథని చూస్తున్నప్పుడు ఫిక్షన్ అనిపించదు. ఇది అలా కాదు. పూర్తిస్థాయి ఫిక్షన్ అని ముందే చెప్పేసారు.

పైగా బాహుబలిని , ఛావా ని పోలి ఉన్న సన్నివేశాలు ఉండడంతో ఈ చిత్రం మేకింగ్ పరంగా భావదారిద్ర్యంతో ఇబ్బంది పడినట్టు అనిపిస్తుంది.

ఫస్టాఫులో పవన్- రఘుబాబు మధ్యన హీరోయిన్ ని కలిసే సీన్ పెట్టారు. అది బాహుబలిలో ప్రభాస్-సత్యరాజ్ అనుష్కని కలిసే సీన్ ని గుర్తుచేస్తుంది. యాంబియన్స్ కూడా అక్కడ “మురిపాలా ముకుందా” పాటని గుర్తు చేసేలా కృష్ణుడు బొమ్మ వగైరాలు పెట్టారు.

ఇక అగ్రహారం బ్రాహ్మణుల్ని బంధించి ఔరంగజేబు వద్దకు తీసుకొచ్చే సీన్, ఔరంగజేబ్ ఉన్నితో ఏదో అల్లుకుంటూ కూర్చోవడం లాంటి సీన్లు “ఛావా” లోని సన్నివేశాల్ని పోలి ఉండడం యాదృచ్ఛికమో, ఉద్దేశపూర్వకమో తెలీదు కానీ ఆ సినిమా చూసినవాళ్లకి ఇవి కాపీ కొట్టారా అనిపిస్తుంది.

దానికి తోడు అత్యంత దారుణమైన స్టాండర్డ్ లో ఉన్న గ్రాఫిక్స్ ఈ చిత్రాన్ని మరింత తలవంచుకునేలా చేసాయి. ఇంత బడ్జెట్ పెట్టుకుని, ఇన్నాళ్లు చెక్కిన ఈ సినిమా ఆఖరికి ఇంత సబ్-స్టాండర్డ్ లో విడుదల చేసారా అని ఆశ్చర్యమేస్తుంది.

గుర్రాల సీన్లైతే దయనీయం. ఏదో ఒక్కసారంటే అనుకోవచ్చు. ఆ గుర్రాల ట్రాక్ చాలాసేపుంది. అంత నాశిరకం గ్రాఫిక్స్ ఊహించడం కూడా కష్టం. అంతే కాదు..హీరో, హీరోయిన్ కూడా ఒక్కో సీన్లో ఒక్కో షేపులో కనిపించారు. హీరోయిన్ ముఖం కూడా నానావంకర్లూ తిరిగి ఒక్కో సీన్లో ఒక్కోలా కనపడింది. అంతా గ్ర్పాఫిక్స్ డిపార్టెమెంట్ ఘనకార్యమే.

అది పక్కన పెడితే ఈ చిత్రానికి ప్రధానమైన పాజిటివ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. కీరవాణి ప్రతిభ ఏ విషయమూ లేని ఈ చిత్రాన్ని కాస్తైనా భరించేలా చేయగలిగింది. అయితే పాటల్లో “తార తార..” ఒక్కటీ వినడానికి బాగుంది, చూడడానికి ఎబ్బెట్టుగా ఉంది. “కొల్లగొట్టినాదిరో..” కొంత వరకు ఓకే. “మాట వినాలి..” అయితే అసలా లిరిక్స్ ఏమిటో అర్థం కావడం కష్టం.

పవన్ కళ్యాణ్ కి ఉన్న సనాతనధర్మం ఇమేజ్ కి అనుగుణంగా కొన్ని సీన్లు కథకి లింకులేకపోయినా జొప్పించారా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా వరుణ యాగం సీన్. అసలు కథకి ఏ మాత్రం సంబంధం లేని, కనీసం ఎమోషనల్ గా అయినా వర్కౌట్ అయిందా అంటే, అదీ లేని సీన్ అది. తోడేళ్ల సీన్ కూడా అంతే.

సంభాషణలు కూడా చాలా పేలవంగా ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ నటనపరంగా చేయడానికేమీ లేదు. 16వ శతాబ్దం గెటప్ వేయడం తప్ప ఆయననుంచి కొత్తగా కనపడింది ఏదీ లేదు. ఏ మాత్రం కన్విన్సింగ్ గా లేని యాక్షన్ సన్నివేశాల్లో కనిపించడం కూడా భవిష్యత్తులో ట్రోలింగ్ చేసే నెటిజన్లకి తప్ప ఎవరికీ ఉపయోగం ఉండదు. సనాతనధర్మ పరిరక్షకుడిగా, జంతు సంరక్షకుడిగా, పేదలపాలిటి పెన్నిధిగా, ఆత్మగౌరవం కోసం ప్రాణాలకి తెగించి దొంగతనం చేయగలిగే వీరుడిగా..ఇలా నానా రకాల యాంగిల్స్ ఉన్నాయి వీరమల్లు హీరోయిజంలో. వీటిలో దేనినీ రక్తికట్టించలేని స్థితిలో ఉంది స్క్రిప్ట్.

నిధి అగర్వాల్ హీరోయిన్ గా మొదలై, మోసగత్తెగా ట్విస్ట్ ఇచ్చి, ఐటం గర్ల్ గా డ్యాన్స్ చేసి, మళ్లీ సోషల్ యాంగిల్ చూపించి..తీరూ తెన్నూ, అతీ గతీ లేని దారిలో పోయింది.

నాజర్, సునీల్, సుబ్బరాజుల పర్పస్ ఏంటో దర్శకుడికే తెలియాలి. తెరని తెలిసిన మొహాలతో నింపడానికి కాకపోతే అసలా పాత్రలు చేసిన ఘనకార్యమేంటో ఆడియన్స్ కి కన్వే కాదు.

ఔరంగజేబుగా బాబీ డియోల్ మాత్రం నిండుగా కనిపించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది.

మిగిలిన నటీనటులంతా ప్యాడింగ్ కి ఎక్కువ, పర్పస్ కి తక్కువ అన్నట్టున్నారు.

అయితే క్లైమాక్సులో ఆ సుడిగుండం సీనేంటో..ఔరంగజేబు-వీరమల్లు గాల్లో తేలుతూ కరచాలనం ఏంటో అంతా గజిబిజి గందరగోళం! నరకంలో ఉన్న ఔరంగజేబు ఆత్మ కూడా అర్ధం కాక తలగోక్కుంటుందేమో! మొదటి భాగాన్ని ఆ గాలిదుమారం సీన్ తో ఆపేసి “వీరమల్లు-2 బ్యాటిల్ ఫీల్డ్” అని టైటిల్ వేసి కుర్చీల్లోంచి లేవమని లైట్లేసారు. ఇంతా చూసాక రెండో భాగం ఎప్పుడొస్తుందా అనే వెయిట్ చేయాలని కూడా అనిపించదు. ఫస్టాఫులో సరిపోయే కథని, అనవసరంగా సాగదీసి “రెండూ ముప్పావు గంటల” చిత్రంగా సాగతీయడం ఒక్క ప్రేక్షకులకే కాదు, నిర్మాతకి కూడా బాధాకరమే. ఐదేళ్ళ పాటు చెక్కిన ఈ చిత్రం ఒక సుందర శిల్పంలా ఉంటుందనుకుని హాలుకెళ్తే వీరబాదుడు బాదుతుంది.

Comments

Popular posts from this blog

Kingdom Review: మూవీ రివ్యూ: కింగ్డమ్